హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు అమ్మవారి కల్యాణోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదమంత్రాల నడుమ.. మేళతాలల ధ్వనుల మధ్య ఎల్లమ్మ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఎల్లమ్మ కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావటంతో…. ఆలయ ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల రాక కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుక సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు…. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా నిన్న ఎదుర్కోళ్లు నిర్వహించగా… ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం జరిగింది. చివరి రోజైన రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు.