రాజాసింగ్, తాను.. ధర్మం కోసం పోరాడేవాళ్లమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తాము కాషాయ జెండా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ధర్మం కోసం పోరాడేది బీజేపీ పార్టీ అని.. ధర్మ రక్షణ కోసం పనిచేశానని ఉద్ఘాటించారు. కాషాయ జెండాను తెలంగాణ అంతటా నేను రెపరెపలాడించానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పగించాక.. పార్టీని పరుగులెత్తించానని తెలిపారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలిపించానని వెల్లడించారు.
‘150 రోజులు ప్రజాసంగ్రామ యాత్ర చేశాను. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై దొంగ కేసులు పెట్టారు. కేసీఆర్ నాపై 30 కేసులు పెట్టారు. హిందువులు ఐక్యం కారని ఎందరో హేళన చేశారు. 80 శాతం ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చి చూపించాను. నాపై మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే.. కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ తీరు సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి.’ అని బండి సంజయ్ కోరారు.