తెలంగాణలో విజయశాంతి బీజేపీ లోకి వెళ్ళిన తర్వాత కొంత మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మెదక్ జిల్లాలో పార్టీ మారే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఆమె పార్టీ మారిన తర్వాత ఎవరూ కూడా విజయశాంతి ని నమ్ముకుని భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది.
విజయశాంతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి కూడా రాలేదు. దీనివలన పార్టీలో ఆమె విషయంలో అభిప్రాయాలు చాలానే ఉన్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే ప్రయత్నం చేయకపోవచ్చు. దీని కారణంగా సమస్యల తీవ్రత పెరుగుతుంది. నాగార్జునసాగర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థి విషయంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చర్చలు జరుపుతున్నారు.
ఈ తరుణంలో నాగార్జున సాగర్ లో అడుగు పెట్టి ప్రచారం చేయడానికి విజయశాంతి ముందుకు రాకపోవడంతో ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆమె విషయంలో ఫిర్యాదు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక విజయశాంతి ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా కార్యకర్తలు వద్ద ప్రస్తావిస్తున్నా… ఆమె విషయంలో ఎటువంటి స్పందన కూడా రావడం లేదు. కనీసం ఆమె మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ మీడియా ముందు కనబడలేదు.