హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలు రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయి. బంజారా, ఆదివాసీ వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలు నిర్మించింది. ఆయావర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవన్‌ల నిర్మాణం జరిగింది.
ఎకరానికిపైగా విస్తీర్ణంలో విశాలంగాఆ భవనాలను నిర్మించారు. ఆయా సామాజికవర్గాల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మాణాలు జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టారు. 50 కోట్లకు పైగా వ్యయంతో కొద్దిరోజుల క్రితమే వాటి నిర్మాణం పూర్తైంది. వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల వేళ రెండు భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆయా వర్గాల జీవనశైలి, నాగరికతను ప్రతిబింబిస్తూ నిర్మితమైన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ఎత్తున కళారూపాల ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించనున్నారు. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన కళారూపాలతో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు.