తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు లక్ష ఆరు వేల మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 15 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, 10 లక్షలకు పైగా అర్హులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గృహలక్ష్మి పథకానికి ఎంపికైన దరఖాస్తుదారులకు 3 దశల్లో రూ. 3 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే ఒక్కో నియోజకవర్గానికి 3000 మంది చొప్పున మొత్తం 3,65,975 మంది లబ్దిదారులను గుర్తించి, మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. 35,000 మందికి సీఎం కోటా కింద మంజూరు చేయనున్నట్టు తెలిపారు.