తెలంగాణ రైతులు, ఉద్యోగులకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తులను ఈసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారని ఈసీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మరోవైపు రైతుబంధు ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీని ఆశ్రయించిందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రైతుబంధు నిలిపివేయాలని తమకు కాంగ్రెస్ నాయకులు ఎవరు ఫిర్యాదు చేయలేదని, రైతుబంధు నిలిపివేయాలని ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని వికాస్ రాజ్ వెల్లడించారు.
దేశంలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు పంచుతున్న డబ్బు, మద్యం మరియు ఇతర ఉచితాలను అధికారులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు.