తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాగోస-బీజేపీ భరోసా’ నినాదంతో ఇవాళ్టి నుంచి కూడలి సమావేశాలను నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనతో పాటు బీజేపీ అధికారం లోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్టు కమలధళం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ విజయాలను, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించనున్నట్లు తెలిపింది. శుక్రవారం ప్రారంభమయ్యే కూడలి సమావేశాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల శక్తి కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నారు. ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో పాల్గొనే వక్తల కార్యశాలను ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో నిర్వహించారు. 11000 సమావేశాల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు.