గోల్కొండ బోనాలు: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

-

హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాల పండుగ షురూ అయింది. ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు అయ్యాయి. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఆగస్టు 8వ తేదీవరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

బోనాలు/bonalu

గతేడాది కరోనా కారణంగా ఇంట్లోనే పండుగ జరుపుకోగా..ఈ ఏడాది కరోనా నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి తలసాని తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version