భారత్ రాష్ట్ర సమితి లోక్ సభ సన్నాహక సమావేశాలు నేతల విభిన్న అభిప్రాయాలకు వేదికలవుతున్నాయి. గురువారం రోజున మహబూబాబాద్ సమావేశంలో ఓ సీనియర్ కార్యకర్త భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చడంతో తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయినట్లు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం తమను ఒత్తిడికి గురి చేసిందని, జీతాలు తగిన సమయానికి ఇవ్వలేదన్న భావన ఉద్యోగుల్లో ఉందని మరో కార్యకర్త తెలిపారు.
సీనియర్ నేత వి.ప్రకాశ్ మాత్రం కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ అవసరం శాసనసభలో లేదని ఆయన పార్లమెంట్‌కు వెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా కేటీఆర్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ ఇక్కడ సరిపోతారని తెలిపారు.
కేసీఆర్ తెలంగాణకు చాలా చేశారని ప్రకాశ్ అన్నారు. ఇప్పుడు ఆయన సేవలు, విజన్ దేశానికి అవసరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మద్థతుతోనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మూడోసారి గెలిస్తే కేసీఆర్ను ఎదుర్కోవడం కష్టమని బీజేపీ కుట్ర చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రకాశ్ ఆరోపించారు.