శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు అన్నారు. పంచాహ్నిక దీక్షతో వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు జనవరి 18న ముగుస్తాయని… ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ప్రతి సంవత్సరం రెండు సార్లు… శివరాత్రికి,సంక్రాంతికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ఇవాళ ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం,అదేరోజు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ,7 గంటలకు ధ్వజారోహణ సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించడంతోపాటు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు.రెండవ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామని.. ఈనెల 15వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, పండుగలో భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో పెడ్డిరాజు వెల్లడించారు.