కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని పునరుద్ఘాటించారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి 88 నుంచి 90 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ అమలుచేస్తున్న అనేక పథకాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిందని.. తమ రైతుబంధును కాపీ కొట్టిందని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పువ్వాడ మాట్లాడారు.
పింఛను పథకం బీఆర్ఎస్ పార్టీదా .. కాంగ్రెస్‌దా.. ఆలోచించాలి. మా పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కాపీ కొట్టింది. కుటుంబసభ్యులకు బీమా చేయడం గురించి ఎవరైనా ఆలోచించారా? 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజలకు బీమా కల్పించిందా? ప్రజలకు మేలు చేసేది కనుకే వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీని కొనసాగించాం. 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ నెరవేర్చలేదు. అని మంత్రి పువ్వాడ అన్నారు.