కాంగ్రెస్ 6 గ్యారెంటీలు సాధ్యమేనని కేసీఆర్ ప్రూవ్ చేశారు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన పార్టీ.. ఇప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం షురూ చేసి.. ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీలను ఓటర్లకు వివరించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న 6 గ్యారెంటీల అమలు సాధ్యమా కాదో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పకనే చెప్పారని అన్నారు. ఆడబిడ్డలకు నెలకు 2500 కాంగ్రెస్ ఇస్తానంటే.. కేసీఆర్ మూడు వేలు ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ హామీ అమలు సాధ్యమేనని రుజువు చేశారని తెలిపారు.

“కాంగ్రెస్ పార్టీ మహిళలకు సిలిండర్‌ రూ.500లకు ఇస్తామంటే.. బీఆర్ఎస్ రూ.400 అని చెప్పింది. కల్యాణ లక్ష్మీతోపాటు తులం బంగారం అనగానే కేసీఆర్‌కు మాట రావటం లేదు. ఛత్తీస్​గఢ్​లో క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇస్తున్నాం. రాజస్థాన్​లో రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇవన్నీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే. అధికారంలోకి రాగానే వీటిని ఆయా రాష్ట్రాల్లో అమలు పరిచాం. ఇప్పుడు తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం” అని జీవన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version