తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆయనకు బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ఆస్పత్రిలోనే మృతి చెందారు. సాయిచంద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, కళాకారులు సంతాపం ప్రకటించారు.
సాయిచంద్ మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సాయిచంద్ మృతదేహాన్ని గుర్రంగూడలోని నివాసానికి కుటుంబసభ్యులు తరలించారు. సాయిచంద్ భౌతికకాయానికి రాజకీయ ప్రముఖులు, కళాకారులు నివాళులు అర్పిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాయిచంద్‌కు నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సొంత సోదరుడిని కోల్పోయినట్టుగా ఉందని కంటతడి పెట్టారు.
‘తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు