మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలహీన పడుతుందని కేటీఆర్ చెప్పారు. గతంలో హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో గెలుస్తుంది అని భావించినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మనసులను ఆ పార్టీ గెలుచుకోలేకపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని తేలిపోయిందన్నారు.
బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసిన ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు.