ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం పాతికేళ్ల క్రితం 1999లోనే అడుగు పడింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్ కారిడార్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో 207.80 కి.మీ. మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్‌గేజ్ నిర్మించాలని అందుకు తక్షణమే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజినీరింగ్ విభాగం సర్వే చేపట్టి సాధ్యాసాధ్యాలను రైల్వే శాఖకు నివేదిస్తుంది. అనంతరం భూసేకరణ సర్వే చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తారు.