ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో మొదట కొల్లూర్‌లో ప్రభుత్వం నిర్మించిన భారీ రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఆరుగురు లబ్ధిదారులతో సీఎం కేసీఆర్ స్వయంగా గృహ ప్రవేశం చేయించనున్నారు. పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజవర్గాలను ఇద్దరి చొప్పున ఎంపిక చేశారు. వీరిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుడుతోపాటు ఒకరు సాధారణ కేటగిరికి చెందిన వారు ఉన్నారు.
కొల్లూరు గృహ సముదాయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 145ఎకరాల విస్తీర్ణంలో 1450కోట్ల రూపాయలు ఖర్చు చేసి 15 వేల 660 ఇళ్లను నిర్మించారు. 117బ్లాకులుగా నిర్మించిన గృహ సముదాయంలో… ఒక్కో బ్లాకులో 8 నుంచి 11 అంతస్థుల వరకు ఉన్నాయి. ప్రతి ప్లాట్‌కు గాలి వెలుతురు ధారళంగా వచ్చేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి బ్లాక్‌కు రెండు లిఫ్టులు, రెండు లేదా మూడు మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. 23శాతం రోడ్లు, డ్రైనేజీల కోసం.. 25శాతం పార్కులు, ఆట స్థలాల కోసం వినియోగించారు. రెండు పడక గదుల గృహ సముదాయం అనంతరం వెలిమల శివారులోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత పటాన్‌చెరుకు చేరుకుని.. 183కోట్ల రూపాయలతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.