తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కార్ 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో నేడే ఆఖరి రోజు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన వేడుకలు…మూడు వారాలుగా వైభవంగా, పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. రోజుకు ఒక రంగం చొప్పున ఆయా రంగాల వారీగా దినోత్సవాలను నిర్వహిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను ప్రజలకు వివరించారు. తొమ్మిదేళ్ల హయంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి వివరిస్తూ కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ్టితో దశాబ్ది వేడుకలు ముగియనున్నాయి.
ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అమరుల సంస్మరణ తీర్మానం చేస్తారు. అన్ని విద్యాలయాల్లోనూ ప్రార్థనా సమావేశంలో అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని తెలిపారు. సాయంత్రం హైదరాబాద్‌లో అమరుల గౌరవార్థం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో అమరుల స్మారకం వరకు జరిగే ర్యాలీలో… ఐదు వేలకుపైగా కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తారు.