బ్రిటీష్ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పది – సిఎం కెసిఆర్

-

దేశ స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలనకోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం నాడు హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా దేశం కోసం వారు చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు.

గిరిజనుల హక్కుల సాధన కోసం నాటి పరాయి పాలకులైన బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమైనవన్నారు. సీతారామ రాజు వంటి వీరుల స్ఫూర్తితో ఎందరో దేశ పౌరులు నాటి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. భారత రాష్ట్రపతి పాల్గొంటున్న, చారిత్రక సందర్భమైన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డమీద హైదరాబాద్ లో నిర్వహించుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రజలకోసం పోరాడే త్యాగధనుల జీవితాలు విశ్వజనీనమైన స్ఫూర్తిని పంచుతాయని, వారి త్యాగాలను స్మరించుకుంటూ రేపటి తరాలు ముందుకు సాగాలని సీఎం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version