అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి – సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితుల పై ఆరా తీశారు. శుక్రవారం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాల పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలిచ్చారు.

వరదలు తగ్గుముఖం పట్టి బురదమయమైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపుకు గురైన ప్రాంతాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్‌ ద్వారా అందించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మూడవ రోజూ గోదావరి ముంపునకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భారీ వర్షాలతో చెరువులు తెగడం, రహదారులు, బ్రిడ్జ్ లు కోతకు గురికావడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జిహెచ్ఎంసి పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version