నేడు దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలు ఈదుల్ ఫితర్‌ను జరుపుకోనున్నారు. రంజాన్ నెల ఉపవాసాల ముగింపు సందర్భంగా వచ్చే ఈదుల్ ఫితర్ కుటుంబ సభ్యులతో వైభవంగా నిర్వహించనున్నారు. దిల్లీలోని ఫతేపురీ మసీదుకు సంబంధించిన రుయత్ ఏ హిలాల్ కమిటీ దేశంలోని పలు ప్రాంతాల కమిటీలతో సంప్రదింపులు జరిపింది. శుక్రవారం సాయంత్రం దిల్లీతోపాటు ఆయా ప్రాంతాల్లో నెలవంక కనిపించినట్లుగా సమాచారం అందినట్లు ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ తెలిపారు.
నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ పండుగ పలు దేశాల్లో ఒకరోజు వెనుకాముందుగా జరుగుతూ ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చంద్ర దర్శనంతో రంజాన్ నెల ముగిసి, షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది.
ప్రేమను పంచే పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సమాజంలో సోదరభావం, సామరస్యం పెంచేందుకు అందరూ ప్రతిన బూనాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.