రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు రెండు వారాలపాటు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా చూసుకోవడంపై దృష్టి సారించారు. ప్రభుత్వ పథకాలు సహా ఆగస్టు 15లోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాన్ని.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు.
ఇందులో భాగంగానే ఇవాళ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవుతారని వివరించారు.