తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకు ఎనిమిది ప్రాంతాలలో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవాయిలో 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా మారడంతో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు బయలుదేరారు సీఎం రేవంత్. రోడ్డు మార్గం ద్వారా ఆయన ఖమ్మం కి బయలుదేరారు.
ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు రేవంత్. మార్గమధ్యంలో మున్నేరు వాగు బీభత్సానికి గురైన వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు. అంతేకాదు ఈరోజు రాత్రి ఖమ్మంలోనే బస చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇక రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.