ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి వైసీపీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను తీర్చడం పై లేదని మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు పేర్కొన్నారు. తాజాగా శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. తుఫాన్లు వచ్చి ప్రజలందరూ తిండిలేక ఇబ్బందులు పడుతుంటే.. వారి గురించి పట్టించుకోకుండా వేరే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయాలు ఉన్నాయని.. కనీసం సచివాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేయలేదన్నారు. జగన్ ని తిట్టడానికే అనితకు హోంమంత్రి పదవీ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. బుడమేరు గేట్లు అర్థరాత్రి తెరవడం వల్లనే విజయవాడ మునిగిపోయిందని, దీనికి బాధ్యత ఎవరిది అని నిలదీశారు. కరకట్టలో చంద్రబాబు నాయుడు ఇల్లు అక్రమ కట్టడం అని.. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే పరువు పోతుందని బస్సులో ఉంచారని అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబులో నిర్లక్ష్యం ఎక్కువ అయిందని పేర్కొన్నారు. వరదలు రాకుండా చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని.. జగన్ సీఎంగా ఉంటే ఇబ్బందే ఉండేది కాదని విజయవాడ ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు అప్పలరాజు.