అమెరికాలో తెలుగు విద్యార్థులపై దాడులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు విద్యార్థులపై దాడులపై సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతపై తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
చికాగోలో హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజహర్ పై దాడి, ఒహియోలో శ్రేయాస్ రెడ్డి హత్య కలవరం కలిగిస్తోందని సీఎం ట్వీట్ చేశారు. మంగళవారం రోజున తాను నివసిస్తున్న సమీపంలోనే సయ్యద్‌పై కొంతమంది దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. రక్తంతో తడిసిసిన సయ్యద్ అలాగే వీడియో రికార్డు చేసి తనకు సాయం చేయాలని భారత్ ఎంబసీని, కేంద్ర, రాష్ట్ర, అమెరికా ప్రభుత్వాలను కోరాడు. మరోవైపు మజహర్ భార్య భర్త దగ్గరకు వెళ్లడానికి అత్యవసర విసా ఇప్పించాలని కేంద్ర మంత్రిని వేడుకున్నారు.