తెలంగాణలో డ్రగ్స్ పేరు పేరెత్తాలంటేనే భయపడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్న మాదకద్రవ్యాల నియంత్రణపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ లో మత్తుమందుల ప్రభావం ఎక్కువగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి కనిపిస్తోందని సీఎం అన్నారు. ఇన్ఫార్మర్ల వ్యవస్థ రూపొందించుకోవాలని, డ్రగ్స్ పేరెత్తాలంటేనే భయపడే పరిస్థితి రావాలని అధికారులకు రేవంత్ స్పష్టం చేశారు.
ఇక అటు హైదరాబాద్‌లోని జ్యోతిబా ఫులె ప్రజాభవన్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇక నుంచి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రజావాణి’లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని.. ప్రజావాణికి వచ్చేవారి సౌకర్యార్థం తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.