ఆసియాలో అతిపెద్ద గిరిజన మహాజాతర సమ్మక్క-సారలమ్మ జాతర గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈ జాతరకు వెళ్లలేని భక్తులకు ఆన్ లైన్ లో మొక్కులు చెల్లించే అవకాశాన్ని దేవదాయ శాఖ కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లోనే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే కార్యక్రమాన్ని ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా సీఎం సమర్పించారు. మరోవైపు తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరకు ఆన్ లైన్ సేవలను దేవాదాయ శాఖ గత బుధవారమే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.