నేడు పాశమైలారం ప్రమాద ఘటనాస్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు పాశమైలారం పారిశ్రామికవాడకు చేరుకుని పరిశీలించనున్నారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున కమిటీ ఏర్పాటు చేశారు.

సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్టుమెంట్ పీఎస్, హెల్త్ సెక్రెటరీ, ఫైర్‌సర్వీసెస్ అడిషనల్ డీజీ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలు కమిటీకి అప్పగించారు.
ఇక సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో 57 మంది ఇంటికి సురక్షితంగా వెళ్లారని వెల్లడించారు.