సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్లకు ఫ్యాన్సీ నంబర్ 0009ను కేటాయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి రేవంత్ కొత్త కాన్వాయ్ ని నిన్న ఉపయోగించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా అందులో అసెంబ్లీకి వెళ్లారు.
అయితే అసెంబ్లీకి వెళ్లే మార్గంలో సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. అధికారుల వైఫల్యంతోనే ఇలా జరిగినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు, బాధ్యులపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ మంత్రివర్గ సహచరులకు శాఖల కేటాయింపు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు శాఖలను ఇంకా ఖాళీగానే ఉంచారు. తనతో పాటు మిగిలిన 11 మందికి వివిధ శాఖలను కేటాయించారు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.