ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలో యువ వికాసం సభలో పాల్గొని మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే
55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు
ఇచ్చామని.. ఇలా దేశంలోని ఏ రాష్ట్రంలో జరుగలేదని తెలిపారు. అంతేకాదు.. ఏడాదిలో 25 వేల
కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కోటిమంది కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోమని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ , మాజీ సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు.
గుజరాత్ లో ఏ ఏడాదైనా 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే తనతో చర్చించేందుకు రావాలని కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సవాల్ చేశారు. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికి కాదు రాష్ట్రాన్ని సాధించుకున్నదని అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని మండిపడ్డారు. వీలైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. కానీ, విమర్శలు చేయాలని సూచించారు.