నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

-

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సైతం సీఎం కలిసే అవకాశమున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి నిధులను కేటాయించాలని మంత్రులను కోరారు.

ఇక ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలిసి రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలపనున్నారు. అలాగే వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఈ ఇద్దరు నేతల దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లే అవకాశముంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా దిల్లీకి వస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా గురువారమే మోదీ, అమిత్‌షాలతో భేటీ అవుతున్నారు. విభజన సమస్యలపై ఇరురాష్ట్రాల సీఎంలు 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కావడానికి ముందు ఇద్దరూ దిల్లీలో ప్రధాని, హోంమంత్రులను కలవనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version