2020 LRSపై సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం !

-

 

2020 భూముల క్రమబద్దీకరణ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్ కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లే అవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలన్నీ ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేండ్లుగా నిరీక్షిస్తున్నాయి.

వివిధ కోర్టు కేసులతో ఈ ప్ర్రక్రియ ఆలస్యమైందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్ర్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.అప్పటి నిబంధనల ప్రకారమే లే అవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లే-అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version