తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందన్నారు. డీలిమిటేషన్ పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నాయని అన్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని.. ఎవ్వరినీ పిలవాలో కలిసే డిసైడ్ చేస్తున్నాయన్నారు.
అలాగే నిన్న పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయని చెప్పారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కి చివరి రోజు అని.. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లీస్ అభ్యర్తికి మద్దతుగా నిలిచాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులంతా కోడై కూశారని.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని గుర్తుకు చేశారు.