తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఓటు వేసేందుకు కదలి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ కవిత ఏమన్నారంటే..?
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ దృష్టికి తీసుకెళ్లింది. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్‌ను కోరినట్లు కాంగ్రెస్ నేత నిరంజన్ తెలిపారు.