ఎన్నికల సమయంలో సాగర్​ వద్ద వివాదం మంచిదికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

-

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు సాగర్‌ వద్దకు చేరుకుని కాపలాగా ఉన్న.. ఎస్​పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులూ అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు ఏపీ పోలీసులు గేట్లు దూకి.. సీసీ కెమెరాను లాఠీతో ధ్వంసం చేసి ప్రాజెక్టు 13వ క్రస్ట్ గేటు దగ్గరకు వెళ్లారు. 26 గేట్లలో 13 గేట్లు తమవంటూ ఏపీ పోలీసులు కంచెవేశారు.

ఈ వ్యవహారంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కృష్ణానది జలాలకు సంబంధించి విభజన చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగిందని.. ఎవరి దామాషా ప్రకారం వారు వినియోగించుకొవాలని అందులో చెప్పారని గుర్తు చేశారు. సాగర్ మిగులు జలాలను మంచినీటి కోసం వాడుకోవాలని చెప్పారని.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతన్న సమయంలో ఏపీ పోలీసుల ఇలా వచ్చి దౌర్జన్యం చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఏపీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో దండయాత్రలా రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు ఈ వ్యవహారంపై మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి స్పందిస్తూ.. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణకు సూచించారు. ఇలా వివాదానికి దిగడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కృష్ణా బోర్డు పరిధిలో సమస్య ఉందని.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని కోరారు. కృష్ణాబోర్డును అప్రమత్తం చేసి ఈ సమస్య పరిష్కరించకపోతే ఈ వివాదం మరింత ముదురుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version