ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసిందని, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం బాధాకరమని, పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే, జీతాలు లేకపోవడంతో విధుల బహిష్కరణ చేసి భిక్షాటన చేస్తున్న పంచాయతీ కార్మికుల ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చింది.
“మీ పదేళ్ల పాలనలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకుని సిగ్గు తెచ్చుకోండి హరీష్ రావు. మీరు కక్కుర్తి పడి, మీ కాంట్రాక్టుల్లో కమిషన్ల కోసం గ్రామ పంచాయతీ నిధులను వాడుకున్నారు. ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకు వచ్చారు. తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే అమరవీరుల స్థూపం ముందు నువ్వు, నీ మామ, నీ బావ వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి” అని తీవ్ర విమర్శలు చేసింది.