జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కు ముందు తనకు ఇష్టమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జీవన్ రెడ్డి.. స్వామివారికి ముడుపులు కట్టారు. అంజన్న స్వామి దయతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఆయన కోరుకున్నారు. అలాగే తాను భారీ మెజారిటీతో గెలవాలని జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేయనున్నారు.
మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మూడో రోజు 206 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు.. 446 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో రోజు 17 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు దాఖలు చేశారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ షబ్బీర్ అలీ.. నామిషనేషన్ వేశారు. అతని వెంట కుమారుడు ఇలియాస్.. ఇతర జిల్లా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కామారెడ్డి జిల్లా.. బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా బీర్కూరు మండలానికి చెందిన పుట్ట భాస్కర్ నామినేషన్ వేశారు.