తెలంగాణ రైతులకు శుభవార్త. రెండో విడత రుణమాఫీ ఇవాళ ప్రారంభం కానుంది. లక్షన్నర రుపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు.
రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 19న మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమ చేసింది. ఆధార్ నంబరు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17 వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.