బీర్ఆర్ఎస్ పార్టీ బీ-ఆర్ఎస్ఎస్ గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ హెడ్ క్వార్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వైఖరి బిజెపి వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్పై బిజెపి ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్పై బీఆర్ఎస్ అవే ఆరోపణలు చేస్తుందని.. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు.
140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం నిర్మించుకునేందుకు ఇన్నేళ్లు పట్టిందని తెలిపారు. నిన్న గాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు, 40 ఏళ్ల సీనియారిటీ మాత్రమే ఉన్న బిజెపి స్వల్పకాలంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. బిజెపి ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితి గతి ఎలా ఉందో గమనించాలన్నారు. అవసరమైన నిర్ణయాలు, ప్రణాళికలు రచించబడతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.