నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించిన విషయం తెలిసిందే. డ్యాం నిర్వహణ తాత్కాలికంగా సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షణలో ఉండనుంది. ఈ నేపథ్యంలో సాగర్ డ్యామ్ పైకి సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం కల్లా సాగర్ డ్యామ్ పూర్తిగా కేంద్రం అధీనంలోకి రానుంది.
ఆ తర్వాత 13వ గేటు వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. కేంద్ర బలగాల రాకతో డ్యామ్ పై నుంచి తెలంగాణ పోలీసులు వెనుదిరిగి వెళ్తున్నారు. మరోవైపు సాగర్ డ్యామ్ నుంచి కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాల్వ ద్వారా ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. గత నెల 29న ఏపీ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో తలెత్తిన వివాదం చివరకు కేంద్ర బలగాలు డ్యామ్‌ను ఆధీనంలోకి తీసుకునే వరకు దారితీసింది.