దాదాపు 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు మళ్లీ హైదరాబాద్ వేదికగా మారింది. నగరంలో నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నగరానికి ఈరోజు తరలిరానున్నారు.
శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తుక్కుగూడకు వెళ్లి విజయభేరి సభా వేదికను పరిశీలించారు. ఆ తర్వాత తాజ్‌కృష్ణా హోటల్‌కు వచ్చి సమావేశాల సన్నాహకాలపై సమీక్షించారు. శనివారం మధ్యాహ్నం తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు.
కమిటీ సభ్యులు సోనియా, రాహుల్ సహా ఇతర నేతలంతా ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా ఆదివారం ఉదయం పదిన్నరకు ఇదే హోటల్‌లో సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఇందులో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శానససభ, మండలి పక్ష కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఇది ముగిశాక మధ్యాహ్న భోజనం చేసి నేతలంతా తుక్కుగూడలో జరిగే ‘విజయభేరి సభకు హాజరవుతారు.