త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు. ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని చెప్పారు. బీఆర్ఎస్ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా దొరికేది కాదని వ్యాఖ్యానించారు. అపాయింట్‌మెంట్ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలోఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారన్న దానం నాగేందర్ విలువ లేనిచోట ఉండలేక కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అందరికీ విలువ ఉంటుందని దానం నాగేందర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులే లేవని.. కేటీఆర్ బినామీలు రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న బినామీల వివరాలు త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి మేకపోతు గాంభీర్యాలు పలుకుతున్నారని.. ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ మేకపోతు గంభీర్యాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. జైలులో ఉన్న కవితను బయటకు తేకుండా రాజకీయాలు చేస్తున్నారని దానం అన్నారు.