ధరణి పోర్టల్లో జరిగిన భూ లావాదేవీల్లో చట్టవిరుద్ధమైనవి ఉండొచ్చని కొత్త ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే వాటి గుట్టు తేల్చే పనిలో పడింది. ఇందుకు రెండు రకాల ఆడిటింగ్ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 13న జరిపిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో అందుకు రెవెన్యూశాఖ సన్నద్ధమవుతోంది.
ఓవైపు ప్రజల సమక్షంలో సామాజిక(సోషల్) ఆడిటింగ్ మరోవైపు లావాదేవీలు ఎవరు, ఎక్కడి నుంచి చేశారో గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా ఏ కంప్యూటర్(ఐడీ) ద్వారా, ఏ నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హక్కులు మార్చారు, రెవెన్యూ ఉద్యోగుల బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే పోర్టల్‌ను ఎవరు, ఎప్పుడు తెరిచారో తెలుస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు సోషల్ ఆడిటింగ్ ద్వారా వాస్తవ యజమాని ఎవరు, ఇప్పుడు ఎవరున్నారు, 2014 తరువాత కొత్తగా భూముల్లోకి వచ్చినవారు ఎవరో ప్రజల సమక్షంలో గుర్తించనున్నారు. తద్వారా అక్రమార్కులను కట్టడి చేయాలని సర్కారు భావిస్తోంది. నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి.. ఆడిటింగ్ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది.