విగ్రహాలు కాలాలు
కాలం చెప్పే చరిత్రకు
విగ్రహం ఆనవాలు
కాలం చెప్పే కొన్ని సంగతులకు
అదొక సాక్షి.. సమతా మూర్తి ఒక సాక్షి
తిర్పతి వెంకన్న ఓ సాక్షి..
జాతిని ఉద్దేశించి నడిచే మనుషులకు
కేవలం పై పై మాటలతోనే కడుపు నింపి పంపడం ఎందుకు?
కొన్నయినా వాస్తవాలు తెలియజేయవచ్చు కదా!
సరికొత్త ధార్మిక జగత్తు చెంత ఎందరెందరో వచ్చి వెళ్తున్నారు. జియరు స్వామీజీ ఏవేవో చెబుతున్నారు. ఎవరినెవరినో పొగుడుతున్నారు. రాజ్యాన్ని నడిపే శక్తులను రాముడితో పోలుస్తుండారు. అధికారం ఉన్నా వినయ సంపన్నతతో ఉంటున్నారని అంటున్నారు. సమతా మూర్తి గురించి చేయాల్సిన భాషణ కన్నారాజకీయ నాయకుల భజన ఎక్కువయి ఉంది అన్న విమర్శల దగ్గర ముచ్చింతల్ మరిన్ని చింతలు రేపుతోంది. వేదనలు తొలగి వాదనలు మిగిలి జీవితాంతం ఒక స్వేచ్ఛాయుత పరిణామ గతికి ఈ ఆశ్రమ ప్రాంగణాలు ఎందుకు ఆనవాలుగా నిలవవు అన్న ప్రశ్నకు బదులు లేదు.
రెండు వందల అడుగులకు పైగానే కొలువు దీరిన విగ్రహం. సమానత్వ సూచికకు నిలువెత్తు నిదర్శనం. ముచ్చింతల్ వీధుల్లో చిద్విలాస రూపానికి ఇప్పుడు అంతా చేస్తున్నారొక వందనం. సమతా మూర్తికి వందనం అని చెప్పడంలో ఆధ్యాత్మికం ఉంది. సామాజిక చింతన ఉందో లేదో కూడా తెలియదు. వెయ్యేళ్ల కిందట సమానత్వ భావనలు జనంలోకి తీసుకుని వెళ్లారని అంటున్న హైందవ సంస్కృతి పెద్దలు, వెయ్యేళ్లు అయినా సమానత్వం సాధించలేకపోయాం అని ఎందుకు అనుకోవడం లేదు అని?
విగ్రహం అన్నది మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పడం ఇప్పుడొక ఆవశ్యక పరిణామం. విగ్రహం ఎలా ఉన్నా ఎంత ఎత్తున ఉన్నా ఎన్ని కేజీల బరువు తూగి కొలువుదీరినా, ఎంతటి రంగులతో శోభిల్లినా మన జీవితాలను అవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అన్నది ముఖ్యం. సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) చెంత సమానత్వం అన్నది సాధ్యం కాని పని.
కాని పనిని మరింత కానివ్వని ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు మన స్వాములు. మన దళిత వాడల్లో మన బడుగు జీవితాల్లో ఇంకా సమానత్వం లేదు కనుక మనం ఇటువంటివి చూసి విని వైభవోపేత ధోరణికి ఇవి సంకేతాలు అని భావించి నవ్వుకుని పక్కకు తొలగిపోవాలి. అంతకుమించి ఏమీ ఆలోచించకుండా ఉండడమే మేలు.
– రత్నకిశోర్ శంభుమహంతి