రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. శివ బాలకృష్ణ కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులను కోరింది. ఎఫ్‌ఐఆర్, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న బాలకృష్ణను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఈ విచారణలో అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద భారీగా ఆస్తులున్నట్లు గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. శివ బాలకృష్ణకు సంబంధించి రూ.250 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు వెల్లడించింది. అందులో 214 ఎకరాల భూమి బినామీల పేరు మీద ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అతడు హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాలని భావిస్తున్న ఏసీబీ మరోసారి బాలకృష్ణను కస్టడీకి తీసుకునే యోచనలో ఉంది. ఇంతలోనే ఇందులో ఈడీ రంగంలోకి దిగి కేసు వివరాలు అడగడం గమనార్హం.