తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను ఇవాళ కేటాయించనున్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి 95,383 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గడువు బుధవారం రాత్రి వరకు ఉండగా.. అప్పటివరకు ఎంత మంది అన్నది ప్రవేశాల కమిటీ అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. దాదాపు 96 వేల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కన్వీనర్ కోటాలో 72,741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో సీఎస్‌ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి.
రెండో విడత కౌన్సెలింగ్ జులై 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 27న సర్టిఫికేట్ వెరిఫికేషన్,. 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్,. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 13న ఆఖరి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. ఇక కన్వీనర్ కోటాలో ఇంటర్నల్ స్లైడింగ్ ఆగస్టు 21,22 తేదీల్లో, ఆగస్టు 26న సీట్ల కేటాయింపు పూర్తవుతుంది.