తెలంగాణలో తాను తెలియని వ్యక్తి లేరని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తన పనితనం చూసిన ప్రజలు ఎంపీగా తనను గెలిపించుకుంటామని చెబుతున్నారని తెలిపారు. 70 రోజుల ప్రచారంలో ఎక్కడ మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించలేదని వెల్లడించారు. మోదీకే ఈ సారి తమ ఓటు అంటూ ప్రజలు ఎలుగెత్తి చాటుతున్నారని వివరించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఈటల ఈమేరకు మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలకు తెలియదు.. వాళ్లకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదు అంటున్నారు. ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు మల్కాజ్ గిరిలో వస్తాయి. మైనార్టీలు కూడా బీజేపీకి ఓటు వేస్తామని చెబుతున్నారు. నా ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలను చూడలేదు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కాళేశ్వరం అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అని ఈటల ఆరోపించారు.