తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే రాష్ట్రానికి వందల కొద్ది అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయి. వాటి పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పాయి. తాజాగా వాటి జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ చేరింది. ఈ సంస్థను రాష్ట్రంలో నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ గ్రామంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్కాన్ సంస్థ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఫాక్స్కాన్ సంస్థ నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఫాక్స్కాన్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.