ప్రతిష్ఠాత్మక జీ-20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. జీ-20లో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించి 3 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగాయి. మొదటి సదస్సు ఇండోర్‌లో, రెండోది చండీగఢ్‌లో, మూడోది వారణాసిలో జరగాయి. హైదరాబాద్‌లో వ్యవసాయ మంత్రులస్థాయి సమావేశం తొలిసారిగా జరగనుంది.
ఈ సదస్సులో తొమ్మిది దేశాల వ్యవసాయశాఖ మంత్రులు సమావేశానికి హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇక్రిశాట్ సహా పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయి. ఆహార భద్రత, పోషకాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలో జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై చర్చిస్తారు. జీ-20కి సంబంధించిన కీలక సమావేశాలకు హైదరాబాద్ వేదిక అయిందని కిషన్ రెడ్డి అన్నారు.