తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

-

తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు  స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌ కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేయనున్నారు.

శాసనసభ కార్యదర్శికి ఈరోజు ఉదయం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు. మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా ప్రసాద్ కుమార్ కు మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనమైంది. అయితే ఈ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version