తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన దిల్లీకి వెళ్లారు. సతీసమేతంగా 10 జన్‌పథ్‌లో సోనియా గాంధీని కలిశారు.
అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికైన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.